ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు మహ్మద్‌ సిరాజ్‌ – జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి

0
14
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ఆస్ట్రేలియాలో తొలి సారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకొని కోహ్లీ సేన సరికొత్త రికార్డు సృష్టించింది. అదే జట్టుతో మూడువన్డేల సిరీస్‌కు సమాయత్తమవుతుంది. టెస్టు సిరీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన భారత సంచలన పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి కల్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌ పర్యటనలో బుమ్రా ఆడట్లేదని ప్రకటించింది. అతడి స్థానంలో హైదరాబాద్‌ కుర్రాడు మహ్మద్‌ సిరాజ్‌కు అవకాశం కల్పించింది.తర్వాతి సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడమే మంచిదని భావించాం. ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌ పర్యటనలో బుమ్రా స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ ఆడుతాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

తాజా టెస్టుల్లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. కేవలం 12 నెలల క్రితమే టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా ప్రస్తుతం కీలక పేసర్‌గా మారిపోయాడు. ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో 21 వికెట్లు తీయడం విశేషం.

జనవరి 12 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ అనంతరం ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు టీమిండియా న్యూజిలాండ్‌ బయల్దేరుతుంది. జనవరి 23 నుంచి న్యూజిల్యాండ్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది.