పోలవరం, మిషన్‌కాకతీయలకు కేంద్రప్రభుత్వ పురస్కారాలు

0
268

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక పోవలరం ప్రాజెక్టుకు, తెలంగాణలో చెరువు పునరుద్ధరణకు ఉద్దేశించి చేపట్టిన మిషన్‌ కాకతీయలకు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి.దిల్లీలోని స్కోప్‌ కాంప్లెక్స్‌లో శనివారం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ వార్షికో త్సవం జరిగింది. ఈ సందర్భంగా నీటిపారుదల, విద్యుత్‌ రంగాల్లో కృషి చేసిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు ప్రదానం చేసింది.

పోలవరం ప్రాజెక్టు ఉత్తమ ప్రణాళిక, నిర్మాణానికి ఏపీ నీటిపారుదల శాఖకు అవార్డు వరించింది. ఏపీ ప్రభుత్వం తరఫున జలవన రుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు హాజరై కేంద్ర మంత్రి ఆర్‌.కె.సింగ్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపట్టిన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖకు అవార్డు దక్కింది.

రాష్ట్రం నుంచి హాజరైన చీఫ్‌ ఇంజినీర్‌ శ్యామ్‌ సుందర్‌ పురస్కారం అందుకున్నారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేసిన కృషికి గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా శ్యామ్‌ సుందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉందని, రూ.8,700 కోట్లతో ఇప్పటివరకూ 27,667 చెరువులు అభివృద్ధి చేసినట్లు చెప్పారు. మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కింద 16లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోందని వెల్లడించారు.