తిసారా పెరీరా తుఫాన్‌ శతకం – రెండో వన్డేలోనూ శ్రీలంక ఓటమి

0
11
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
శ్రీలంక ఆల్‌రౌండర్‌ తిసారా పెరీరా తుఫాన్‌ శతకం (140) సాధించినప్పటికీ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. దీంతో మూడువన్డేల సిరీస్‌ను ఒక్క మ్యాచ్‌ మిగిలి ఉండగానే కివీస్‌ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

మౌంట్‌ మౌంగానీలో వేదికగా జరిగిన రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ టేలర్‌ (90 పరుగులు), మున్రో (87 పరుగులు, 12 ఫోర్లు, 2 సిక్సర్లు), నీషమ్‌(64 పరుగులు 5 ఫోర్లు, 3 సిక్సర్ల)తో అర్థశతకాలు సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.శ్రీలంక బౌలర్లలో మలింగ 2, ప్రదీప్‌ ఒక్క వికెట్‌ పడగొట్టారు. నలుగురు బ్యాట్స్‌మెన్‌ రనౌట్‌ కావడం విశేషం.

అనంతరం 320 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ప్రారంభంలోనే ఓపెనర్‌ డిక్‌వెల్లా వికెట్‌ కోల్పోయింది. మరో ఓపెనర్‌ గుణతిలక (71 పరుగులు 9 ఫోర్లు) రాణించినా మిడిలార్డర్‌ ఘోరంగా విఫలమవడంతో ఒకదశలో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి భారీ పరాజయం దిశగా పయనించింది. ఈ సమయంలో తిసారా పెరీరా కివీస్‌ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుక పడ్డాడు.

మలింగతో కలసి 8 వికెట్‌కు 75 పరుగులు, సందకన్‌తో కలసి 9వికెట్‌కు 51 పరుగులు, ప్రదీప్‌తో కలసి చివరి వికెట్‌కు 44 పరుగులు జోడించడం విశేషం. సౌతీ వేసిన 45 ఓవర్లో 4 సిక్సర్ల బాది గెలుపుపై ఆశలు రేపిన పెరీరా 46 ఓవర్లో చివరి వికెట్‌గా వెనుదిరిగడడంతో శ్రీలంక 21 పరుగులు తేడాతో ఓడిపోయింది.పెరీరా కేవలం 74 బంతుల్లో 8 ఫోర్లు, 13 సిక్సర్లతో 140 పరుగులు చేయడం విశేషం.‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం తిసారా పెరీరాకే దక్కింది.