తెలంగాణలో మోగిన పంచాయతీ ఎన్నికల నగారా

0
10
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు విడతలుగా జనవరి 21, 25, 30 తేదీల్లో పోలింగ్‌ను నిర్వ హించనున్నారు. ఈనెల 7, 11, 16 తేదీల్లో ఆయా ప్రాంతాల రిటర్నింగ్‌ అధికారులు ఇచ్చే నోటీసులతో నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. పోలింగ్‌ ముగిసిన రోజునే ఫలితాలను వెల్లడించి, చేతులెత్తే పద్ధతిలో ఉప సర్పంచి ఎన్నికలను సైతం పూర్తి చేస్తారు.

ఎన్నికల ప్రక్రియను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) మంగళవారం నోటిఫికేషన్‌ను వెలువరించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీలు ఉండగా వాటిలో ఇప్పుడు 12, 732 పంచాయతీల్లో ఎన్నికలను చేపట్టనున్నారు. ఇంకా గడువు ముగియక పోవడం వల్ల 17 పంచాయతీల్లోను, కోర్టు కేసుల కారణంగా మరో రెండుచోట్ల ఎన్నికలను నిర్వహించడంలేదు.

మొత్తం 1,13,170 వార్డుల్లో ఎన్నికలను చేపడతారు. ఎన్నికల షెడ్యూల్‌తో కూడిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెలువరించారు. 2018, మే నాటికి గ్రామీణ ఓటర్లు 1.37 కోట్లు ఉండగా.. ఆ తర్వాత చేరికలతో వారి సంఖ్య 1.49 కోట్లకు చేరిందని చెప్పారు.

సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉండటంతో పాటు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఎస్‌ఈసీ నిర్దేశించిన 18 రకాల కార్డుల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలన్నారు. తాము నిర్దేశించిన మొత్తాలకు మించి ఖర్చు పెట్టిన వారు పదవులను కోల్పోయే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

ఇప్పటికే 3.36 కోట్ల బ్యాలెట్‌ పత్రాలను ముద్రించామని, పోలింగ్‌కు 92,223 బ్యాలెట్‌ పెట్టెలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఆయా రోజుల్లో పోలింగ్‌ ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు.