ఈనెల 23న విశాఖపట్నానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌

0
21
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ఈనెల 23వ తేదీ నుండి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆంధ్రప్రదేశ్‌తోపాటు, ఒడిశా, పశ్చిమ బంగ, న్యూఢిల్లీలో పర్యటన చేయనున్నారు. రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్‌ తొలి పర్యటన ఇదే కావడం విశేషం. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది.

ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్‌, కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 23న ఉదయం 10గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖకు బయల్దేరతారు. విశాఖలో శారద పీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వెళ్తారు.

సాయంత్రం 6గంటలకు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో కేసీఆర్‌ సమావేశం కానున్నారు. 24న కోణార్క్‌, పూరీ జగన్నాథ్‌ ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం భువనేశ్వర్‌ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు వెళ్తారు. సాయంత్రం బంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతారు. ఆ తర్వాత కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు.

అదే రోజు రాత్రి దిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 25 నుంచి రెండు, మూడు రోజుల పాటు దిల్లీలోనే కేసీఆర్‌ బస చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా భేటీ కానున్న ముఖ్యమంత్రి ‌ ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతోనూ సమావేశమవుతారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌తోనూ కేసీఆర్‌ సమావేశం కానున్నారు.