టిడిపికి గుడ్‌బై చెప్పిన పీలేరు నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్‌ ఇక్బాల్‌ అహ్మద్‌

0
24

మనఛానల్‌ న్యూస్‌ – పీలేరు
చిత్తూరుజిల్లా పీలేరు నియోజకవర్గపు టిడిపి మాజీ ఇంఛార్జ్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 20మంది నేతలు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పాతిక సంవత్సరాలు టీడీపీకి సేవ చేసి ఎంతో నష్టపోయామని ఇక్బాల్‌ వాపోయారు.

2014లో కిరణ్‌కుమార్‌ రెడ్డి కుటుంబం మీద పోటీచేయాలని తన మీద చంద్రబాబు ఒత్తిడి తీసుకవచ్చారని  అందుకే పోటీ చేశానన్నారు. అయితే ఎన్నికల తరువాత అన్నివిధాల ఆదుకొంటామని సీఎం రమేష్‌ కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చాక క్యాబినేట్‌ పదవిని ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని అన్నారు.నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డిని టీడీపీలో చేర్చుకునేటప్పుడు తనకు నామినేటెడ్‌ పదవిని ఇస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత పట్టించుకోలేదన్నారు. పైగా కిషోర్‌ కుమార్‌ రెడ్డికి ఇన్‌చార్జీ బాధ్యతలను ఇవ్వడమే కాకుండా కార్పోరేషన్‌ పదవిని కూడా ఇచ్చారన్నారు.

సీఎంను కలిసి అనేక సార్లు తాను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పానన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాతే చంద్రబాబుకు ముస్లింల పట్ల ప్రేమ కనపడుతోందని విమర్శించారు.