మైఖేల్‌ను భారత్‌కు అప్పగించిన యూఏఈ

0
18
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
దేశవ్యాప్తంగా సంచనం రేపిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్‌ జేమ్స్‌ మైకేల్‌(57)ను యూఏఈ భారత్‌కు అప్పగించింది. మంగళవారం రాత్రే ఆయన్ని దుబాయ్‌ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. బ్రిటన్‌ జాతీయుడైన మైకేల్‌ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది.

ఈ కుంభకోణంలో మైకేల్‌తో పాటు గైడో హాష్కే, కార్లో గెరోసా అనే మధ్యర్తులపైనా ఈడీ, సీబీఐలు దర్యాప్తు జరుపుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పర్యవేక్షణలో చేపట్టిన ఆపరేషన్‌ మూలంగానే మైకేల్‌ను భారత్‌కు అప్పగించేందుకు యూఏఈ అంగీకరించిందని సీబీఐ తెలిపింది.

సీబీఐ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వర రావు ఈ ఆపరేషన్‌ను సమన్వయపరచగా, జాయింట్‌ డైరెక్టర్‌ సాయి మనోహర్‌ నేతృత్వంలోని బృందం మైకేల్‌ను తెచ్చేందుకు దుబాయ్‌ వెళ్లిందని వెల్లడించింది. వైమానిక దళ మాజీ చీఫ్‌తో కుమ్మక్కు హెలికాప్టర్ల కుంభకోణంలో మైకేల్‌ పాత్ర 2012లో వెలుగుచూసింది.

ఒప్పందాన్ని ఆ కంపెనీకే కట్టబెట్టేలా భారత అధికారులకు అతడు అక్రమంగా చెల్లింపులు జరిపినట్లు సీబీఐ ఆరోపించింది. సహనిందితులైన నాటి వైమానిక దళ చీఫ్‌ ఎస్పీ త్యాగి, ఆయన కుటుంబీకులతో కలసి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తెలిపింది.

విచారణ నుంచి తప్పించుకోవడానికి అతడు విదేశాలకు పారిపోయాడని సీబీఐ వెల్లడించింది. దీంతో మైకేల్‌పై 2015లో నాన్‌–బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. ఈ వారెంట్‌ ఆధారంగా ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీచేయడంతో 2017 ఫిబ్రవరిలో దుబాయ్‌లో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.