నేటితో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర

0
18
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. నేటి సాయంత్రం 5 గంటలకు ప్రచారహోరు ముగియనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారటంతో ప్రచారం నువ్వా? నేనా? అన్నట్లుగా సాగుతోంది.

పోలింగ్‌ ప్రక్రియ ముగియటానికి 48 గంటల ముందుగా ప్రచారానికి తెరదించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన. ఇదిలా ఉండగా ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నియోజకవర్గాలకు కేటాయించాల్సిన ఈవీఎంలు, వీవీపీఏటీలను సిద్ధం చేశారు. కాస్త ఆలస్యమైనప్పటికీ ఈవీఎంలపై అతికించే బ్యాలెట్‌ పత్రాల ముద్రణ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి అయింది.

పోలింగ్‌ నిర్వహణకు 32,815 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ‘అందరికీ అందుబాటులో ఎన్నికలు’ అనే నినాదంతో ఈ దఫా దివ్యాంగులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా పోలింగ్‌ సమయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. సాధారణ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ ఉదయం 7 గంటలకే ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తీవ్రవాద ప్రభావిత సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ముగియనుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ప్రచారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.