రేవంత్ రెడ్డి అరెస్ట్ – నేడు కొసిగిలో కె.సి.ఆర్. బహిరంగసభ

0
190
advertisment

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
కె.సి.ఆర్ ను కొడంగల్ లో అడుగుపెట్టనివ్వని హెచ్చరించిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేసి శంషాబాద్ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ అదుపులో పెట్టుకొని ఉన్నట్లు సమాచారం.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై నిరంతరం ఒంటి కాలుపై లేస్తున్న రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్‌ లో అడుగు పెట్టనివ్వని,కెసిఆర్ రాకకు నిరసనగా ర్యాలీ నిర్వహించాలని చేసిన పిలుపును దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా ఆయనను తమ అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు  చెప్పుతున్నారు.

మరో వైపు కె.సి.ఆర్ మంగళవారం తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కొడంగల్ నియోజవర్గంలోని కోస్గిలో బహిరంగ సభలో పాల్గోంటున్నారు. ఈ నేపథ్యంలో ఏటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా రేవంత్ ను అదుపులోకి తీసుకొన్నారు.

అయితే పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. మంగళవారం వేకువ జామున 3 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగులగట్టి అతన్ని అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

పోలీసుల తీరుపై రేవంత్‌రెడ్డి భార్య గీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన భర్త రేవంత్ రెడ్డిని నిద్రలేపి బలవంతంగా తీసుకెళ్లారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఓటుతో కె.సి.ఆర్ కు బుద్ధి చెప్పాలని ఆమె కోరారు.

advertisment

కొడంగల్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 144 సెక్షన్‌ అమలవుతోంది. కొసిగిలో కె.సి.ఆర్ సభ ప్రశాంతంగా జరగడానికి పోలీసులు అన్నిచర్యలు తీసుకొన్నారు.