సుజనా చౌదరి కంపెనీల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

0
256

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నాయకుడు సుజనా చౌదరి కంపెనీలలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సీబీఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు కుమారుడు శ్రీనివాస కల్యాణ్ రావుకు సంబంధించిన కేసులో సుజనా చౌదరి ప్రమేయంపై ఈడీ విచారిస్తోంది.

బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ పేరిట శ్రీనివాస కల్యాణ్ రావు బ్యాంకుల నుంచి సుమారు రూ.304 కోట్ల రుణాలు తీసుకొని డొల్ల కంపెనీల ద్వారా నిధులు మళ్లించారన్నది అభియోగం. గతంలో కేసు నమోదు చేసిన చెన్నై సీబీఐ.. శ్రీనివాస కల్యాణ్ రావుపై అభియోగపత్రం దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీట్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.

ఆ కేసులో సేకరించిన ఆధారాల ప్రకారం.. డొల్ల కంపెనీలకు సుజనా చౌదరి సంస్థలతో సంబంధాలున్నట్లు ఈడీ భావిస్తోంది. డొల్ల కంపెనీల డైరెక్టర్లుగా ఉన్న వారితో సుజనా చౌదరి మెయిల్, ఇతర మార్గాల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు ఈడీ అనుమానిస్తోంది.

ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఇల్లు, కార్యాలయాల్లో అక్టోబర్‌లో సోదాలు నిర్వహించిన చెన్నై ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి మరోసారి తనిఖీలు చేశారు. సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాల్లో పలు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, రికార్డులు తనిఖీ చేసి కొన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.