అమెరికాలో దుండగుడి కాల్పులకు నలుగురి మృతి

0
18
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. షికాగోలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.మెర్సీ ఆస్పత్రి పార్కింగ్‌ ప్రదేశంలో ఓ మహిళతో వాగ్వాదం జరిగిన అనంతరం అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఓ పోలీసు అధికారి సహా ముగ్గురు చనిపోయారు.

దుండగుడు కూడా కాల్పుల్లో హతమయ్యాడు. అయితే అతడు తనంతట తాను కాల్చుకున్నాడా లేదంటే పోలీసుల కాల్పుల్లో చనిపోయాడా అనే విషయం స్పష్టంకాలేదు. ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న ఓ మహిళపై తొలుత దుండగుడు కాల్పులు జరిపాడని, తర్వాత మరో మహిళను కూడా కాల్చాడని పోలీసులు వెల్లడించారు.

వీరిద్దరూ ఆస్పత్రి ఉద్యోగులు అని తెలిపారు.తొలుత బుల్లెట్లకు బలైన మహిళ దుండగుడి మాజీ ప్రేయసిగా భావిస్తున్నారు. దుండగుడిని అడ్డుకోబోయిన పోలీసు అధికారి జిమెనెజ్‌ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన ఇద్దరు మహిళలతో పాటు దుండగుడి వివరాలు వెల్లడికాలేదు.

ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన కాల్పుల ఘటనతో సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భద్రతా సిబ్బంది ఆస్పత్రిలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు పంపించారు.