
మనఛానల్ న్యూస్ – సినిమా డెస్క్
భారతదేశపు ప్రఖ్యాత యాడ్‌ఫిల్మ్ మేకర్ ఆల్కే పదంసీ (90) అస్తమయమయ్యారు. శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. ముంబయి: ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఆల్కే పదంసీ (90) ఇకలేరు. శనివారం ముంబయిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
1982లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం ‘గాంధీ’లో ఆల్కే ‘ముహమ్మద్ అలీ జిన్నా’ అనే పాత్రను పోషించి మంచి గుర్తింపు పొందారు. దేశంలోనే ప్రముఖ వాణిజ్య ప్రకటనల కంపెనీ ‘లింటాస్ ఇండియా’కు హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అందుకే ఆయన్ను అందరూ ‘బ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అడ్వర్టైజింగ్’ అని పిలుస్తుంటారు.
ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన లలితాజీ సర్ఫ్, లిరిల్ గర్ల్, చెర్రీ చార్లీ షూ పాలిష్, హమారా బజాజ్ తదితర ప్రముఖ ప్రకటనల రూపకల్పన వెనుక ఆల్కే ఉన్నారు.ఆల్కే సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2000లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ముంబయిలోని అడ్వర్టైజింగ్ క్లబ్ ఆయన్ను ‘అడ్వర్టైజింగ్ మెన్ ఆఫ్ ది సెంచరీ’ బిరుదుతో సత్కరించింది.
2012లో ఆయన ‘సంగీత్ నాటక్ అకాడమీ ఠాగూర్ రత్న’ అవార్డును కూడా పొందారు.ఆల్కే మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, నటి నిమ్రత్ కౌర్, నిర్మాత అటుల్ కస్బేకర్ తదితరులు ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు.