అమెరికాలో ఎత్తైన పర్వతం నుండి లోయలో పడి భారత దంపతుల మృతి

0
25

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
అమెరికాలో ఓ భారత దంపతులుఉ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే కాలిఫోర్నియాలోని ప్రముఖ యోసెమైట్‌ జాతీయ పార్కులో సుమారు 800 అడుగుల అత్యంత ఎత్తైన పర్వతం పైనుంచి వీరు లోయలో పడ్డట్లు స్థానిక వార్తా పత్రిక వెల్లడించింది.

వీరిని విష్ణు విశ్వనాథ్‌ (29), మీనాక్షీ మూర్తి (30)గా గుర్తించారు. విశ్వనాథ్‌కు ఇటీవలే సిస్కో సంస్థలో సిస్టమ్‌ ఇంజినీరుగా ఉద్యోగం రావడంతో భార్యాభర్తలిద్దరూ ఇటీవలే న్యూయార్క్‌ నుంచి శాన్‌జోస్‌ నగరానికి నివాసం మార్చారని శాన్‌ ఫ్రాన్సిస్‌కో క్రానికల్‌ పత్రిక వెల్లడించింది.

వీరిద్దరూ కలిసి ప్రపంచ యాత్ర కూడా చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. పర్వతంపై భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా దిగిన ఫోటోను విశ్వనాథ్‌ ఫేస్‌బుక్‌లో ఉంచారు.ఘటన జరిగిన ఒక రోజు తర్వాత వీరి మృతదేహాలను పర్యటకులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. దంపతుల మృతికి గల కారణాలేంటో తెలియాల్సి ఉందని, ఆ దిశగా విచారణ జరుపుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.