నిరుద్యోగులను మోసం చేసిన తెదేపా ప్రభుత్వం – పీలేరు ఎమ్మెల్యే చింతల

0
82
advertisment

– నిరుద్యోగ నిరాహారదీక్షకు మద్ధతు తెలిపిన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
మనఛానల్‌ న్యూస్‌ – తిరుపతి
నిరుద్యోగులను తెలుగుదేశం ప్రభుత్వం నిలువెల్లా మోసం చేసిందని పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి ఎస్‌.వి.యూనివర్సిటీలో నిరుద్యోగులు తలపెట్టిన 48 గంటల నిరాహారదీక్షకు ఆయన మద్ధతు తెలిపారు.

నోటిఫికేషన్‌లను సకాల౦లో విడుదల చేయకపోవడం వలన కొందరి నిరుద్యోగుల అర్హత వయస్సు దాటిపోతున్నదన్నారు. పలు నోటిఫికేషన్ల ద్వారా వేల పోస్టులను భర్తీ చేస్తామని తెలుగుదేశం నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఎందుకు ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. నోటిఫికేషన్లు విడుదలవుతాయని సంవత్సరాల తరబడి ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారన్నారు. ఇందుకు వాళ్లు వేలాది రూపాయలను ఖర్చు చేసుకుంటున్నారన్నారు.

నోటిఫికేషన్ల విడుదల చేయడంలో జాప్యం వహిస్తూ నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నదన్నారు. ముఖ్యంగా డీఎస్సీ, గ్రూప్‌-1ఎ, బి, గ్రూప్‌-2, గ్రూప్‌-4, వీఆర్వో ఉద్యోగాల నియామకాలకు వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఒక పక్క వయస్సు మీరిపోతుండడం, మరో పక్క నోటిఫికేషన్ల విడుదల కాక నిరుద్యోగులు మానసిక క్షోభకు గురవుతు న్నారన్నారు. జాబు కావాల౦టే…బాబు రావాలని చెప్పిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడేమంటారన్నారు.

advertisment

ముఖ్యమంత్రి యువనేస్తం పథకంతో నిరుద్యోగ యువతీ, యువకులను ప్రభుత్వం తప్పుదోవ పటిస్తున్నదన్నారు. నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులలో కొందరికి మాత్రమే భృతి అందించడం విడ్డూరంగా ఉందన్నారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను యువత, ప్రజలు గమనిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో టిడిపికి తగిన గుణపాఠం చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఆయన ఉద్ఘాటించారు.