ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

0
418

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్టోబర్‌ 2న గాంధీజీ 150వ జయంతిని పురష్కరించుకొని అమరావతిలో మంగళవారం ప్రారంభించారు.

దేశ స్వాతంత్య్రోద్యమంలో అనేక ఉద్యమాలు చేసిన మహాత్మా గాంధీజీ, దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన లాల్‌బహదూర్‌ శాస్త్రి జన్మదినం రోజున ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరావతిలోని ప్రజావేదిక హాలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా 13 జిల్లాల నుంచి వచ్చిన 400 మంది లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రప౦చ౦లోనే యువతరం ఎక్కువగా ఉన్న దేశం మనదేనని తెలిపారు. అర్హులైన యువత ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే వారి ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించి పథకాన్ని వర్తింపచేస్తారని తెలిపారు.

ఈ పథకానికి 6.15లక్షల మంది నమోదు చేసుకోగా వెరిఫికేషన్‌ తర్వాత సుమారు 2.15లక్షల మంది అర్హత సాధించినట్లు తెలిపారు. వీరి బ్యాంక్‌ అకౌంట్‌కు ప్రయోగాత్మకంగా నిన్ననే రూపాయి జమ చేశామని మిగిలిన రూ.999 రేపు జమ అవుతుందని చెప్పారు.

గతంలో ఇలాంటి పథకాలు కొన్నిచోట్ల ప్రారంభించినా విఫలమ య్యాయని వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పకడ్బందీగా ఈ పథకాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.నిన్న ‘ముఖ్యమంత్రి యువనేస్తం’పై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసి అర్హత పొంది చివరలో నమోదు బటన్‌ క్లిక్‌ చేయని 20వేల మందికి కూడా నిరుద్యోగ భృతి అందేలా నిబంధనల్లో సడలింపులు చేయాలని అధికారులను ఆదేశించారు.

భృతిని బుధవారంలోగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం ఆదేశించారు. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే యువనేస్తం పథకం ప్రారంభోత్సవాల్లో లబ్ధిదారులంతా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

లబ్ధిదారులకు భృతి రూ.వెయ్యితో పాటు అప్రెంటిస్‌షిప్‌ సమయంలో రూ.1500 ప్రోత్సాహకంగా ఇచ్చేందుకున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. భృతికి అర్హులై ఇప్పటికీ దరఖాస్తు చేసుకోనివారు ప్రతి నెలా 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.