TODAY MORNING NEWS @ manachannel.in

0
41
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – న్యూస్‌ డెస్క్‌
1. చిత్తూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలకలంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కేరళ వెళ్లి వచ్చిన ముగ్గురు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే స్వైన్‌ఫ్లూ రోగుల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అయితే అధికారికంగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదని అధికారులు చెబు తున్నారు. జిల్లాలో స్వైన్‌ఫ్లూ భయంలేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. స్వైన్‌ఫ్లూ‌కు సంబంధించి వైద్య అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతి స్విమ్స్‌లో స్వైన్ ఫ్లూ చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.

2. దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులకు మరో చేదువార్త చెప్పింది. రోజువారీ క్యాష్‌ విత్‌డ్రాయల్‌ పరిమితిని మరింత కుదించింది. ఏటీఎం ద్వారా రోజువారీ నగదు ఉపసంహరణపై కస్టమర్లకు షాకిచ్చింది. ఏటీఎంల ద్వారా వినియోగదారులు పొందే నగదును సగానికి కోత పెట్టి కేవలం రూ.20వేలుగా నిర్ణయించింది. ఇంతకుముందు ఈ పరిమితి 40వేల రూపాయలుగా ఉంది. అయితే అక్రమ లావాదేవీలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే డిజిటల్‌, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. అక్టోబర్‌ 31 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ప్రకటించింది.

3. దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాలతోప్రారంభమైనాయి. నిఫ్టీ 11వేలకు దిగువనేట్రేడ్‌అవుతోంది. సెన్సెక్స్‌ 117 పాయింట్లు కోల్పోయి 32, 109 వద్ద,నిప్టీ 56 పాయింట్లు క్షీణించి 10,874 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్‌ సెక్టార్‌ భారీగా నష్టపోతోంది. ఇంకా మెటల్‌, ఆటో, విమానరంగ షేర్లు నష్టపోతున్నాయి. అయితే రూపాయి బలహీనత నేపథ్యంలో ఐటీ షేర్లు పుంజుకున్నాయి.ప్రధానంగా బంధన్‌ బ్యాంకు 20శాతం పతనమైంది. సీఈవో రెమ్యునరేషన్‌ చెల్లింపులను ప్రస్తుతానికి నిలిపివేస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వెలువడటంతో ‍ ప్రైవేటురంగ సంస్థ బంధన్‌ బ్యాంకు కౌంటర్లో అమ్మకాలకు తెర లేచింది.

4. తనకు పార్టీలు మారాల్సిన అవసరం లేదని, నైతిక విలువలు, నీతి నిజాయితీలే పెట్టుబడిగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని టీఆర్‌ఎస్‌ నేత, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పార్టీ అధినే కేసీఆర్‌ మాటే తనకు శిరోధార్యం అని అన్నారు. ఆదివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని హరిత హోటల్‌లో విలేకరులతో ఆయ న మాట్లాడారు. ఈ మధ్య సోషల్‌ మీడియాలో తాను టీఆర్‌ఎస్‌ను వీడుతున్నానని తప్పుడు ప్రచా రం జరుగుతోందని, అలాంటి వాటిని ప్రజలు, మీడియా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

5. తిరుమల శ్రీవారి కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. అలాగే టైం స్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుండి శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల కోసం టిటిడి అన్ని ఏర్పాట్లను చేసింది.

advertisment

6. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్‌ 1 సోమవారం పెట్రోలు ధర 24పైసలు డీజిల్‌ 30పైసలు పెరిగింది. న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 83.73 రూపాయలు. డీజిల్‌ ధర లీటరు 75.09 రూపాయలు. ఇక వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ్‌ స్థాయిని తాకి మరింత సెగ రాజేస్తున్నాయి. లీటరు పెట్రోలు ధర 91 రూపాయల మార్క్‌నుదాటి 91.08 రూపాయల వద్ద వుంది. అలాగే 32పైసలు పెరిగిన డీజిల్‌ లీటరు ధర రూ .79.72 గా ఉంది.హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటరు ధర రూ. 88.77గాను, డీజిల్‌ ధర 81.68 గా ఉంది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ.87.78, డీజిల్‌ ధర రూ. 80.37.

7. అలనాటి బాలీవుడ్‌ దిగ్గజ నటుడు రాజ్‌కపూర్‌ సతీమణి కృష్ణా రాజ్‌కపూర్‌(88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజ్‌కపూర్‌ మనవరాలు రిధిమా కపూర్‌ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘మిమ్మల్ని ఎప్పుడూ మిస్సవుతూనే ఉంటాం నానమ్మా. ఐలవ్యూ’ అని క్యాప్షన్‌ ఇస్తూ ఆమెతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.ఇటీవల కృష్ణా రాజ్‌కపూర్‌ తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఇంతలోనే ఆమె అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కపూర్‌ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

8. వెంటవెంటనే వచ్చిన రెండు ప్రకృతి వైపరీత్యాల ధాటికి ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో మాటలకందని విషాదం నెలకొంది. భూకంపంతో పాటు సునామీ రావడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభించింది. సహాయ చర్యలు చేపట్టడానికి వీలులేని విధంగా ఎక్కడికక్కడ చెట్లు, భవనాల శిథిలాలు పడి ఉండడంతో జనం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సహాయ చర్యలు చేపట్టడానికి తగిన సామగ్రి లేకపోవడం అధికార యంత్రాంగాన్ని అయోమయంలో పడేసింది. కనీసం తాగడానికి మంచినీరు, తినడానికి ఆహారం దొరకకపోవడంతో గత్యంతరం లేక షాపులను పగలగొట్టి దోచుకుంటున్నారు. గుట్టలుగా పడి ఉన్న మృతదేహాల కారణంగా అంటు రోగాలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో వాటిని సామూహికంగా ఖననం చేస్తున్నారు.

9. జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన ఇద్దరు టెన్త్ విద్యార్థులు ఆత్మహత్యపై సెయింట్ జాన్ స్కూల్ కరస్పాండెంట్ శోభ స్పందించారు. ఇద్దరు విద్యార్థుల్లో మహేందర్ అనే విద్యార్థి రోజూ స్కూల్‌కు వస్తాడని, రవితేజ అప్పుడప్పుడే స్కూల్‌కు వస్తాడని తెలిపారు. అయితే వాళ్ళ గొడవల గురించి తమకు తెలియదని శోభ పేర్కొన్నారు. మరోవైపు ఇద్దరు విద్యార్థుల మృతికి సంతాపంగా స్కూల్ యాజమాన్యం ఈరోజు పాఠశాలకు సెలవు ప్రకటించింది.

10. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఏ పాత్ర పోషించినా దానికి 100 శాతం న్యాయం చేస్తారు. అలాగే తరచూ వివాదాలకు కూడా గురవుతుంటారు. మొన్నటికి మొన్న అనుపమ పరమేశ్వరన్‌ను సెట్లో ప్రకాష్ రాజ్ తిట్టారని ఆమె బాగా బాధపడి కళ్లు తిరిగి పడిపోయిందని వార్తలు వచ్చాయి. అనంతరం మరికొన్ని సందర్భాల్లోనూ ఆయనపై ఇలాంటి అభియోగాలొచ్చాయి. తాజాగా కమెడియన్ సప్తగిరిపై ప్రకాష్ రాజ్ చేయి చేసుకున్నట్టు వార్తలు వినవస్తున్నాయి. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దిల్ రాజు నిర్మిస్తున్న హలో గురు ప్రేమకోసమే సినిమా షూటింగ్‌లో భాగంగా సప్తగిరిపై ప్రకాష్ రాజ్ చేయి చేసుకున్నారని టాక్.