
మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
1.బెంగళూరు నుంచి కాచిగూడ వస్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ జరిగింది. రైలు మహబూబునగర్ జిల్లా దివిటిపల్లి రైల్వేస్టేషన్లో నిలిచిన సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో రైలు కిటికీల నుంచి నగదు, నగలు దోచుకెళ్లారు. ఐదుగురు ప్రయాణికుల నుంచి మొత్తం 25 తులాల నగలు, రూ.10 వేల నగదు దోపిడీ చేశారు. రైలు కాచిగూడ చేరుకున్న అనంతరం బాధితులు రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు.
2. రాయలసీమలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల పూర్తికి చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లలో ఇరిగేషన్‌కు రూ.58వేల కోట్లు ఖర్చుచేశామన్నారు. అవుకు టన్నెల్, గోరుకళ్లు రిజర్వాయర్లను పూర్తిచేశామని చెప్పారు. అవుకు సొరంగం పనుల్లో వైఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై జగన్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. జలయజ్ఞాన్ని వైఎస్ ధనయజ్ఞంగా మార్చారని ఆరోపించారు. పులివెందుల రైతులకు నీళ్లిచ్చిన ఘనత చంద్రబాబుదే అని మంత్రి దేవినేని ఉమా చెప్పుకొచ్చారు.
3. టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. విక్టోరియా లేక్‌లో గురువారం పడవ మునిగిన ఘటనలో 126 మంది మృతి చెందారు. సహాయ సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం వరకు 126 మృత దేహాలను వెలికి తీశారని, మరికొన్నిటిని గుర్తించారని టాంజానియా రవాణా మంత్రి ఇసాక్ కమ్వెలె చెప్పారు. బాధితులంతా బుగొలొరా పట్టణంలో జరిగిన సంత నుంచి తిరిగి వస్తున్నారు. ఉకారా తీరం 50 మీటర్ల దూరంలో ఉందనగా కిందికి దిగే ప్రయత్నంలో అంతా పడవకు ఒకే వైపునకు చేరడంతో పడవబోల్తాపడింది.
4. విశాల్ కథానాయకుడిగా నటించిన ‘సండకోళి’ (పందెం కోడి) తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ శరవేగంగా తెరకెక్కుతోంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. తన సొంత బ్యానరైన విశాల్ ఫిలిం ఫ్యాక్టరి బ్యానరుపై విశాల్ నిర్మిస్తున్నారు. ఇది ఆయనకు 25వ చిత్రం కావడం విశేషం. ఇటీవలే ‘ఇరుంబుతిరై’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు విశాల్.
5. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్ చేసిన వ్యాఖ్యలతో దేశంలో రాజకీయ దుమారం రేగింది. విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వమే డసో ఏవియేషన్ సంస్థకు సూచించిందని హోలన్ చెప్పినట్లు ఫ్రెంచి పత్రిక మీడియాపార్ట్ వెల్లడించింది. అయితే ఈ వార్తలను తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఖండించింది. ఒప్పందాల్లో భారత సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రెంచి కంపెనీలకు ఉంటుందని స్పష్టం చేసింది.
6. టీఆర్ఎస్ ప్రకటించిన తొలి జాబితాలో తనకు హుజూర్నగర్ టికెట్ దక్కకుండా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకున్నారని కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. తనకు హుజూర్నగర్ టికెట్ దక్కకుంటే మంత్రిపై సూసైడ్ నోటు రాసుకుని ఎల్బీ నగర్ రింగ్‌రోడ్డులో ప్రాణ త్యాగానికి పాల్పడతానని స్పష్టం చేశారు. శుక్రవారం ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ హుజూర్నగర్ టికెట్ తనకు కేటాయించేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అనుకూలంగా ఉన్నారని, అయితే, మంత్రి జగదీశ్‌రెడ్డి వారి వద్ద అసత్యాలు చెప్పి అడ్డుపడు తున్నారని ఆరోపించారు.
7. వరుస విజయాలతో ఆసియా కప్ గ్రూప్ ‘బి’లో టాపర్‌గా నిలిచిన అఫ్గానిస్తాన్ శుక్రవారం జరిగిన సూపర్–4 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎదుట నిలువలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌లో సత్తా చాటినా… బౌలింగ్‌లో అనుభవరాహిత్యంతో ఓటమి పాలైంది. 258 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అధిగమించింది. షోయబ్ మాలిక్ (43 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) చివరి వరకు క్రీజులో నిలిచి పాకిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చాడు.
8. తెల౦గాణ శాసన మండలి సమావేశాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. మండలి సమావేశాల నిర్వహణపై శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుందని సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సమాచారమిచ్చారు. శాసనసభ రద్దయిన నేపథ్యంలో శాసనమండలి సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాలు చివరిసారిగా మార్చి 29న జరిగాయి.
9. చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థిగా నూతనకాల్వ అనీషారెడ్డి పోటీచేస్తారని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం రాత్రి విజయవాడలోని ఉండవల్లిలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన.. పలుమార్లు చర్చించి పుంగనూరులో గెలుపు కోసం అనీషారెడ్డి పేరును నిర్ణయించినట్లు తెలిపారు. కడప జిల్లా రాయచోటి మండలం బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కె.రఘురామరెడ్డి కుమార్తె అయిన అనీషా బీఏ ఎల్ఎల్బీ చేశారు.
10. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో విజిలెన్స్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. కృష్ణా, ప.గో, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, కడప జిల్లాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు తూనికలు, కొలతల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్పడిన పలువురిపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు.