మట్టి వినాయక ప్రతిమలతో పర్యావరణ పరిరక్షణ – హెల్ఫింగ్‌ మైండ్స్‌

0
404

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
మట్టి వినాయకులతోనే పర్యావరణ పరిరక్షణకు అవకాశముందని హెల్ఫింగ్‌ మైండ్స్‌ వ్యవస్థాపకులు అబూబకర్‌ సిద్ధిఖ్‌ అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని హెల్ఫింగ్‌ మైండ్స్‌, చైతన్య సర్వీస్‌ సొసైటీల వారి సౌజన్యంతో పట్టణంలో ఒక మొక్కను, మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను ఉచితంగా అందజేయడం జరుగుతున్నది.

ఇందులో భాగంగా మదనపల్లి డీఎస్పీ చిదానందరెడ్డి, ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాసులు చౌదరి, జ్ఞానోదయ కరస్పాండెంట్‌ కామకోటి ప్రసాదరావు, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జోళపాలెం భవానీ ప్రసాద్‌లకు ఒక మొక్క, మట్టి వినాయకుడి ప్రతిమను అందజేశారు.

ఈ సందర్భంగా అబూబకర్‌ సిద్ధిఖ్‌ మాట్లాడుతూ మన సాంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమే పర్వదినాలని వాటిని కులమతాలకు అతీతంగా జరుపుకోవడమే భారతీయుల గొప్పదనమన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్నదని, దీనిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.

ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా హానికరమైన రసాయనాలతో రూపొందించిన వినాయకుడి ప్రతిమలను ఉపయోగించడం వలన ఉత్సవాల అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేయడం జరుగుతుందన్నారు. రసాయనాలతో రూపొందించిన వినాయకుడి బొమ్మలు నీటిలో కరిగిపోకుండా అలానే ఉండడం వలన అందులోని రసాయనాలు నీళ్లలో కలుషితమయ్యే ప్రమాదము౦దన్నారు.

తద్వారా వాటిని తాగిన మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే ఉపయోగించి పర్యావరణాన్ని రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. హెల్ఫింగ్‌ మైండ్స్‌, చైతన్య సర్వీస్‌ సొసైటీ సంస్థల గురించి పలువురు ప్రస్తావిస్తూ సమాజంలో ఈ సంస్థల సేవా కార్యక్రమాలను కొనియాడారు.

అనాథలకు ఆపన్న హస్తం అందించడం, మిగిలిపోయిన ఆహారాన్ని అభాగ్యులకు అందించడం, పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేయడం, ఆపదలో ఉన్న వారికి అవసరమైన రక్తాన్ని అందించడం, పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సమాజాభివృద్ధిలో వారు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు.