
మనఛానల్ న్యూస్ – స్పోర్ట్స్ డెస్క్
ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి మరోసారి భారత బ్యాటింగ్ లైనప్ కుదేలైంది.నాలుగో రోజు, ఆదివారం ముగిసిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా 60 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఒక దశలో 123/3తో లక్ష్యం దిశగా సాగింది.
విరాట్ కోహ్లి (58; 130 బంతుల్లో 4 ఫోర్లు), అజింక్య రహానె (51; 159 బంతుల్లో 1 ఫోర్) కీలక భాగస్వామ్యంతో విజయంపై ఆశలు రేపారు. కానీ కోహ్లి ఔటవగానే భారత్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. 51 పరుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో భారత్‌ను దెబ్బ తీసిన స్పిన్నర్ మొయిన్ అలీ (4/71) రెండో ఇన్నింగ్స్‌లోనూ విజృంభించాడు. కోహ్లితో పాటు మరో ముగ్గురిని ఔట్ చేసి భారత్ పతనాన్ని శాసించాడు. అతడికే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఉదయం 260/8తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్.. ఇంకో 11 పరుగులే చేసి ఆలౌటైంది. దీంతో భారత్ ముందు 245 పరుగుల ఛేదించదగ్గ లక్ష్యమే నిలిచింది.
ఐతే భారత్‌కు ఛేదనలో పేలవ ఆరంభం లభించింది. 22 పరుగులకే 3 వికెట్లు నేలకూలాయి. రాహుల్ ఖాతా తెరవకుండానే బ్రాడ్ (1/23) బౌలింగ్‌లో బౌల్డయిపోయాడు. అండర్సన్ (2/33) తొలి ఇన్నింగ్స్ హీరో పుజారా (5)తో పాటు ధావన్ (17)ను ఔట్ చేశాడు.ఈ స్థితిలో కోహ్లి, రహానె గొప్ప పట్టుదల చూపించారు.
ఇంగ్లిష్ బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ సంయమనంతో ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. చుట్టూ ఫీల్డర్లను మోహరించి.. కఠినమైన బంతులు సంధించినా కాచుకున్నారు. మంచి టెక్నిక్‌తో అండర్సన్ బృందానికి సమాధానం చెప్పారు. కొంచెం కుదురుకున్నాక సులువుగానే పరుగులు సాధించారు. ఇద్దరూ 40 ఓవర్లకు పైగా వీరు బ్యాటింగ్ చేశారు.
కానీ 51వ ఓవర్లో మొయిన్ అలీ బౌలింగ్‌లో కోహ్లి ఎల్బీగా వెనుదిరగడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. విరాట్ సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది. ఈ వికెట్‌తో భారత్ ఒత్తిడిలో పడిపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. పాండ్య (0) స్టోక్స్ బౌలింగ్‌లో డకౌటై వెనుదిరిగాడు. రిషబ్ పంత్ (18) రాగానే ఎదురుదాడితో ఇంగ్లాండ్ బౌలర్లను ఆత్మరక్షణలోకి నెట్టాలని చూశాడు.
అతను రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. కానీ పంత్.. అలీ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగడం.. కాసేపటికే రహానె ఔటైపోవడంతో భారత్‌కు ఓటమి తప్పదని తేలిపోయింది. చివర్లో అశ్విన్ (25) కాసేపు పోరాడాడు. ఐతే అతడిని కరన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుని మ్యాచ్‌ను ముగించాడు.