షూటింగ్‌లో బంగారు పతకాన్ని అందించిన రహీ జీవన్‌

0
275

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌డెస్క్‌
ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. నిన్న సౌరభ్ చౌదరి షూటింగ్‌లో తొలి బంగారు పతకాన్ని అందించగా, బుధవారం మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో షూటర్‌ రహీ జీవన్‌ సర్నోబత్‌ పసిడిని గురిచూసి కొట్టింది. ఈ పోరు ఆద్యంతం ఉత్కంఠకరంగా జరగడం గమనార్హం.

బంగారాన్ని ముద్దాడేందుకు రహీ రెండు సార్లు షూటాఫ్‌‌లో పోటీ పడటం విశేషం. థాయ్‌ షూటర్‌ యంగ్‌పైబూన్‌, కొరియా అమ్మాయి కిమ్‌ మిన్‌జుంగ్‌ రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.ఫైనల్లో రహీ జీవన్‌, యంగ్‌పైబూన్‌ హోరాహోరీగా తలపడ్డారు.

ఇద్దరూ చెరో 34 పాయింట్లతో సమానంగా నిలిచారు. స్టేజ్‌-1లో మూడు రౌండ్లలో జీవన్‌ 15 పాయింట్లకు గాను 14 సాధించింది. స్టేజ్‌-2లో జరిగిన 7 రౌండ్లలో 20 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.

స్టేజ్‌-1లో వెనకబడిన యంగ్‌పైబూన్‌ స్టేజ్‌-2లో పుంజుకోవడంతో ఇద్దరూ చెరో 34 పాయింట్లు సాధించారు. తొలి షూటాఫ్‌లోనూ తలో ఐదు గుళ్లు కాల్చగా ఇద్దరూ 4-4తో సమంగా నిలిచారు. రెండో షూటాఫ్‌లో ఐదు గుళ్లకు రహీ జీవన్‌ 3 పాయింట్లు కొల్లగొట్టగా ప్రత్యర్థి కేవలం 2 మాత్రమే చేసింది.