విరాట్‌ కోహ్లీ సెంచరీ – పటిష్ట స్థితిలో భారత్‌

0
39
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
నాటింగ్‌హోమ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడవ టెస్టులో భారతజట్టు పటిష్టస్థితిలో నిలిచింది. ప్రత్యర్థికి 521 పరుగు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.మూడో రోజు, సోమవారం ఆట చివర్లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 9 ఓవర్లాడి వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. కుక్‌ (9), జెన్నింగ్స్‌ (13) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 124/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌.. 352/7 వద్ద డిక్లేర్‌ చేసింది.

తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల తేడాలో సెంచరీ చేజార్చుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ఈసారి పట్టు వదల్లేదు. ఈసారి మూడంకెల స్కోరు (103; 197 బంతుల్లో 10×4) అందుకున్నాడు. చెతేశ్వర్‌ పుజారా (72; 208 బంతుల్లో 9×4) కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (52 నాటౌట్‌; 52 బంతుల్లో 7×4, 1×6) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌ ఫామ్‌ కొనసాగిస్తే నాలుగో రోజే మ్యాచ్‌ ముగిసినా ముగియొచ్చు.

రెండో రోజు భారత్‌ స్కోరు 124/2.ఆధిక్యం 293. ఈ స్కోరుతోనే గెలవడానికి అవకాశాలున్నాయి. అయినప్పటికీ భారత బ్యాట్స్‌మెన్‌ ఎంతమాత్రం ఉదాసీనత ప్రదర్శించలేదు. ఇంగ్లాండ్‌ను మట్టికరిపించడానికి దొరికిన మంచి అవకాశాన్ని వృథా కానివ్వకూడదన్న పట్టుదలతో, ప్రణాళికబద్ధంగా బ్యాటింగ్‌ చేశారు. ముందు రోజే కుదురుకున్న పుజారా, కోహ్లి.. నిలకడ కొనసాగించారు. పుజారా ఒక ఎండ్‌లో గోడ కట్టేస్తే.. కోహ్లి కొంచెం దూకుడుగా ఆడాడు.

ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి ఇంగ్లాండ్‌ బౌలర్లు చాలానే కష్టపడ్డారు. 40 పరుగుల వద్ద పుజారా క్యాచ్‌ను బట్లర్‌ చేజార్చడంతో ఇంగ్లాండ్‌ కష్టాలు మరింత పెరిగాయి. మరోవైపు కోహ్లి ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లాండ్‌ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. కోహ్లి 82 బంతుల్లో అర్ధసెంచరీ చేస్తే.. పుజారా అందుకోసం 147 బంతులు తీసుకున్నాడు. దీన్ని బట్టే వీరి బ్యాటింగ్‌ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

లంచ్‌ విరామానికి భారత్‌ 194/2తో నిలిచింది. విరామం తర్వాత కూడా ఈ జోడీ ఆధిపత్యాన్ని కొనసాగించింది. భాగస్వామ్యం 100 దాటింది. చివరికి 224 పరుగుల వద్ద పుజారా మూడో వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. అతడిని స్టోక్స్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత పుజారా పాత్రను రహానె (29; 94 బంతుల్లో 3×4) పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరే కోహ్లికి అతడి నుంచి చక్కటి సహకారమందింది. భారత కెప్టెన్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

advertisment