క్వారీలో భారీ పేలుడు – కర్నూలు జిల్లాలో 11 మంది మృతి

0
280

మనఛానల్‌ న్యూస్‌ – కర్నూలు
కర్నూలులో ఓ క్వారీలో జిలెటిన్‌ స్టిక్స్‌ పేలి హఠాత్తుగా మంటలు చెరేగాయి. దీంతో ఉపాధి కోసం వచ్చిన 11 మంది కూలీలకు సమాధి కట్టాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారంతా అగ్ని కీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి ఘటన జరిగింది. కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని హత్తిబెళగల్‌ వద్ద క్వారీలో రాత్రి ఉన్నట్టుంది భారీ పేలుళ్లు జరిగాయి.

వెనువెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో కొందరి శరీరభాగాలు చెల్లాచెదురుగా చుట్టుపక్కల ఎగిరిపడ్డాయి. మరో నలుగురు కూలీలు వికాస్‌, మనోహర్‌, రాజేంద్రన్‌, రామచంద్ర అగ్నికీలల్లో చిక్కుకుని సగం శరీరం కాలిపోయి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. క్షతగాత్రులను తొలుత ఆలూరు ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మృతులు..క్షతగాత్రులంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారేనని సమాచారం. పేలుళ్ల అనంతరం మంటలు ఎగసిపడటంతో క్వారీ సమీపంలో ఉన్న షెడ్డు పూర్తిగా దగ్ధమైంది. షెడ్డులో మరికొందరు చిక్కుకుని మృతిచెంది ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

పేలుళ్ల ధాటికి క్వారీ వద్దనున్న రెండు లారీలతోపాటు.. మూడు ట్రాక్టర్లు కాలిబూడిదయ్యాయి. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు, సహాయక చర్యలు చేపట్టారు. ఎస్పీ గోపీనాథ్‌ జెట్టీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం హత్తిబెళగల్‌ సమీపంలో చౌదరి కనెస్ట్రక్షన్స్‌ క్వారీ ఉంది. దానికి అనుబంధంగా కంకర క్రషర్స్‌ ఉన్నాయి. ఈ క్వారీలో దాదాపు 30 మంది ఒడిశా కూలీలు నిత్యం పనిచేస్తుంటారు. కొందరు సమీప గ్రామాల్లో నివాసం ఉంటుండగా, మరికొందరు అక్కడే జీవనం సాగిస్తున్నారు.

క్వారీ పేలుళ్ల కోసం శుక్రవారం ఉదయం తెప్పించిన జిలెటిన్‌ స్టిక్స్‌ను..క్వారీ సమీపంలో కూలీల కోసం నిర్మించిన షెడ్లలోని ఒకదానిలో నిల్వ చేసినట్టు సమాచారం. అక్కడి కూలీలు సాయంత్రం వంట చేస్తున్న క్రమంలో వేడికి అవి పేలి ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

భారీ శబ్దంతో ఒక్కసారిగా ఎర్రని మంటలు ఎగిసినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పేలుడు ధాటికి ఇరవై కిలోమీటర్ల మేర భూమి కంపించింది. క్వారీకి సమీపంలో ఉన్న హత్తిబెళగల్‌, అగ్రహారం, కురవల్లి, ఆలూరు, మొలగవల్లి గ్రామాల్లో పది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు ఏం జరిగిందో తెలియక భయభ్రాంతులకు గురయ్యారు.