జాతీయ ధరల కమీషన్‌ సమావేశంలో పాల్గొన్న ర్యాడ్స్‌ సంస్థ అధినేత మదన్‌మోహన్‌రెడ్డి

0
121

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
జాతీయ ధరల కమీషన్‌ చైర్మన్‌ దేశవ్యాప్తంగా ఉన్న రైతు నాయకులతో న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ర్యాడ్స్‌ సంస్థ అధినేత బి.మదన్‌ మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు పంటలను పండిస్తున్న రైతులు విపత్తుల ధాటికి తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు.

రైతుల పండించే ప్రతి పంటకూ గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా పండుతున్న టమోటో, మామిడి పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు.ప్రస్తుతం రైతులకు పండించిన పంటలకు పెట్టుబడి ధరలకు కూడా లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కోవలోనే అనేక మంది రైతులు వలసలబాట పడుతున్నారన్నారు.

దేశవ్యాప్తంగా రైతులు ప్రకృతి విపత్తుల వలన అధికశాతం నష్టపోతున్నారన్నారు.అదేవిధంగా తడిసిన ధాన్యానికి, మొలక వచ్చిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, దీనికితోడు ప్రకృతి వైఫరీత్యాలు రైతన్నను మరింత కష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతు నాయకులు పాల్గొన్నారు.