
మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
నానాటికీ ఉగ్రవాదుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. శుక్రవారం ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. కశ్మీర్లో ఓ పోలీస్ సిబ్బందిని అపహరించి కిరాతకంగా హతమార్చారు.జావేద్ అహ్మద్ అనే పోలీస్ కానిస్టేబుల్‌ను గత రాత్రి షోపియాన్ జిల్లా నుంచి అపహరించుకుపోయిన ముష్కరులు ఆయనను తుపాకులతో కాల్చి దారుణంగా హత్యచేశారు.
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర మిశ్రాకు వ్యక్తిగత భద్రత కోసం నియమించిన జావేద్‌ను కచ్‌దూరా గ్రామంలోని ఆయన ఇంటి నుంచి గత రాత్రి సాయుధులైన ఉగ్రవాదులు అపహరించి తీసుకెళ్లారని పోలీసులు వెల్లడించారు.ఉగ్రవాదులు జావేద్‌ను తలలో కాల్చి చంపేశారని పోలీసులు వెల్లడించారు.
కుల్గాం జిల్లాలోని సెహ్‌పొరా ప్రాంతంలో రోడ్డు పక్కన ఆయన మృతదేహం లభించినట్లు తెలిపారు. కచ్‌దూరా గ్రామంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో భద్రతాసిబ్బంది ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. అందుకు ప్రతీకారంగానే ముష్కరులు కానిస్టేబుల్‌ను అపహరించి చంపేసినట్లు తెలుస్తోంది.