
మనఛానల్ న్యూస్ – స్పోర్ట్స్ డెస్క్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో ద్రవిడ్ స్థానం దక్కించుకున్నాడు. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ రిచర్డ్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మహిళా జట్టు మాజీ వికెట్ కీపర్ క్లయిర్ టైలర్‌కు ఈ ఐసీసీ అరుదైన గౌరవాన్ని కల్పించింది.దీంతో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఐదో భారత ఆటగాడిగా ద్రవిడ్ నిలిచాడు.
ద్రవిడ్ కంటే ముందు బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలు ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఇక, ఆసీస్ తరఫున ఈ ఘనత సాధించిన 25వ ఆటగాడిగా రికీ పాంటింగ్ నిలిచాడు. తనకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడంపై రాహుల్ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది ప్రతీ ఒక్క క్రికెటర్ కల అని, ఇదొక గొప్ప గౌరవం అని ద్రవిడ్ తెలిపాడు.