బలపరీక్షలో సునాయసంగా నెగ్గిన కుమారస్వామి

0
77
advertisment

మనచానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
అందరూ ఉహించిన విధంగానే విశ్వాసపరీక్షలో కర్ణాటక నూతన ముఖ్యమంత్రి కుమారస్వామి గెలుపు లాంఛనప్రాయమే అయ్యింది. విధానసభలో శుక్రవారం నిర్వహించిన బలపరీక్షలో కుమారస్వామి సునాయాసంగా నెగ్గారు. విశ్వాస పరీక్షకు ముందే భాజపా విధాన సభ నుంచి వాకౌట్‌ చేయడంతో మూజు వాణి ఓటుతో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వం నెగ్గినట్లు స్పీకర్‌ ప్రకటించారు.

కుమారస్వామికి 117 మంది సభ్యుల మద్దతు లభించింది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 12న జరిగాయి. ఈ నెల 15న వెలువడిన ఫలితాల్లో భాజపా 104సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37 స్థానాల్లో గెలుపొందింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు భాజపా, కాంగ్రెస్‌లు పోటీపడ్డాయి.

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా తొలుత భాజపాను ఆహ్వానించడంతో ఆ పార్టీ సీనియర్‌ నేత యడ్యూరప్ప ఈ నెల 17న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే విధానసభలో బలం నిరూపించుకోలేక యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు ముందే తన పదవికి రాజీనామా చేయడంతో భాజపా ప్రభుత్వం మూడు రోజులకే పడిపోయింది.

దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ముందుకొచ్చింది. ఇందుకు గవర్నర్‌ కూడా అంగీకరించారు. అలా గత బుధవారం జేడీఎస్‌ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. నేడు బలపరీక్ష నిర్వహించగా.. కుమారస్వామి విజయం సాధించారు.