చత్తీస్‌ఘడ్‌లో పేట్రేగిన మావోయిస్టులు

0
138

– పోలీసు వాహనాన్ని పేల్చివేయడంతో ఆరుగురు పోలీసులు మృతి
మనచానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
చత్తీస్‌ఘడ్‌లో మరోమారు మావోయిస్టులు పేట్రేగిపోయారు. ఇటీవలి కాలంలో తమ సహచరులను చాలామందిని కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగుతున్నారు.దంతెవాడ జిల్లాలో రహదారి పనుల గస్తీ విధులు నిర్వహించేందుకు వెళ్తున్న భద్రతా సిబ్బంది వాహనం లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు.

దంతెవాడ జిల్లా కిరండోల్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొంతకాలంగా బచేలి-చోల్నార్‌ రహదారి నిర్మాణం జరుగుతోంది. పనుల వద్ద గస్తీ విధులు నిర్వహించేందుకు ఆ జిల్లా పోలీస్‌, ఛత్తీస్‌గఢ్‌ ఏఆర్‌ బలగాలకు చెందిన ఏడుగురు ఉదయం 11 గంటల సమయంలో నిర్మాణ ప్రాంతానికి బొలెరో వాహనంలో బయల్దేరారు. ఆ సమాచారాన్ని పసిగట్టిన మావోయిస్టులు రహదారి వెంట వాగు సమీపంలో మాటువేశారు.

ఓ వంతెన సమీపంలో అమర్చిన శక్తిమంతమైన మందుపాతర(ఐఈడీ)ని పేల్చారు. ఆ ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం వంద అడుగులపైకి ఎగిరిపడి తునాతునకలై శకలాలు సమీపంలోని వాగులో ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్‌ రామ్‌కుమార్‌ యాదవ్‌, ఏఆర్‌ సిబ్బంది పీకే స్వర్గువ్‌, సాలిగ్రమ్‌, విక్రమ్‌ యాదవ్‌, రాజేశ్‌ సింహ్‌, వీరేంద్రనాథ్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అర్జున్‌ రాజ్‌వరన్‌ను హెలికాప్టర్‌లో హుటాహుటిన బచేలీ ఆసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47లు, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, రెండు ఇన్సాస్‌ ఆయుధాలతోపాటు.. గ్రనేడ్‌లను మావోయిస్టులు ఎత్తుకెళ్లినట్టు బస్తర్‌ డీఐజీ రతన్‌లాల్‌ డాంగ్‌ ధ్రువీకరించారు. ఈ నెల 22న బచేలీలో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ వికాస్‌ యాత్ర జరగనుంది. ఈ తరుణంలో ఈ ఘటన జరగడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.