ఆత్మహుతి దాడులతో దద్దరిల్లి కాబూల్‌

0
24
advertisment

మనచానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ ఆత్మహుతి దాడులతో దద్దరల్లింది. ఆప్ఘన్‌ రాజధానిలో జరిగిన రెండు ఆత్మహుతి దాడుల్లో 25 మంది మరణించగా మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు.మృతిచెందిన వారిలో 10మంది జర్నలిస్టులు వున్నారని ఆఫ్ఘన్‌ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.

కాబూల్‌లోని షా డారక్‌ ఏరియాలో సోమవారం ఉదయం రద్దీగా వుండే సమయంలో ఈ పేలుళ్ళు సంభవించాయి. ఈ దాడికి ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌, ఐఎస్‌ఐఎస్‌ కారణమని భావిస్తున్నారు. మొదటి పేలుడు జాతీయ భద్రతా డైరెక్టరేట్‌ (ఎన్‌డిఎస్‌) కార్యాలయానికి సమీపంలో సంభవించింది.

ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చివేసుకున్నాడని హోం శాఖ ప్రతినిధి తెలిపారు. మరో 20 నిమిషాల తర్వాత రెండో పేలుడు సంభవించింది. సంఘటనా స్థలానికి వచ్చిన అత్యవసర సహాయక సిబ్బంది, వైద్య సిబ్బంది, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని రెండో పేలుడు జరిగింది. మొదటి పేలుడు వార్తలను సేకరించేందుకు వచ్చిన జర్నలిస్టులు ఈ రెండో దాడిలో మరణించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

నాటో ప్రధాన కార్యాలయానికి సమీపంలో భద్రత ఎక్కువగా ఉ౦డే ప్రాంతంలోనే ఈ దాడులు జరిగాయని ఆ వర్గాలు చెప్పాయి. గత వారంలోనే ఓటరు నమోదు కేంద్రంపై జరిగిన దాడుల్లో 57మంది మరణించగా, వందమందికి పైగా గాయపడ్డారు. ఈ ఏడాది అక్టోబరులో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హింసాకాండ, దాడులు ఉధృతమయ్యాయి.