– ఢిల్లీపై కోల్‌కతా ఘనవిజయం
మనచానల్ న్యూస్ – స్పోర్ట్స్‌డెస్క్
కొల్కతా ఆటగాళ్లు అండ్రీ రస్సెల్, నితీష్ రాణా సిక్సర్ల వర్షం కురిపించారు. రస్సెల్ తాను ఎదుర్కొన్న 12 బంతుల్లో ఆరు బంతులను సిక్సర్లగా మలచడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా స్కోరు 2.3 ఓవర్లకు కేవల౦ 7 పరుగులే. అదేవిద౦గా 10 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయింది.
అయినా మ్యాచ్ ఆఖరికి 200/9తో ఇన్నింగ్స్‌ను ముగించిందంటే నితీష్ రాణా, రసెల్‌ల విధ్వంసమే కారణం. ఆకాశమే హద్దుగా చెలరేగిన వీళ్లిద్దరు పోటాపోటీగా సిక్సర్లు బాదారు. మోరిస్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్‌తో రాణా మొదలుపెడితే… షమి బౌలింగ్‌ను రసెల్ ఉతికేశాడు. అతనేసిన పదిహేనో ఓవర్లో రసెల్ మూడు భారీ సిక్స్‌లు బాదాడు. మళ్లీ షమినే లక్ష్యంగా చేసుకుంటూ రసెల్ ఒకే ఓవర్లో మరో మూడు సిక్స్‌లు బాదడంతో కోల్‌కతా రన్‌రేట్ రాకెట్లా పరుగెత్తింది.
రాణా కూడా దొరికిన బంతిని దొరికినట్లు బాదడంతో 14 ఓవర్లలకు 123/4తో ఉన్న కోల్‌కతా స్కోరు మరో 4 ఓవర్ల తర్వాత 188/5కు చేరింది. అయితే వరుస ఓవర్లలో రసెల్, రాణా ఔట్ కావడంతో దిల్లీ ఊపిరి పీల్చుకుంది. అంతకుమందు లిన్ (31; 29 బంతుల్లో 4×4, 1×6), ఉతప్ప (35; 19 బంతుల్లో 2×4, 3×6) కోల్‌కతా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
భారీ ఛేదనలో ఆరంభం నుంచి దిల్లీ తడబడింది. తొలి ఓవర్ ఐదో బంతికే రాయ్ (1) వికెట్ కోల్పోయిన దిల్లీ.. ఆ తర్వాత కెప్టెన్ గంభీర్ (8), శ్రేయస్ అయ్యర్ (4) వికెట్లు చేజార్చుకుని 24/3తో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో రిషబ్ పంత్ (43; 26 బంతుల్లో 7×4, 1×6), మాక్స్వెల్ (47; 22 బంతుల్లో 3×4, 4×6) ధాటిగా ఆడి దిల్లీ శిబిరంలో ఆశలు రేపారు.
అయితే పంత్, మాక్స్వెల్లను ఔట్ చేసిన కుల్దీప్ పోటీని ఏకపక్షంగా చేశాడు. వీళ్లిద్దరు ఔటైన తర్వాత మొదలైన పతనం ఇక ఆగలేదు. నరైన్, కుల్దీప్ పోటీపడి వికెట్లు తీసి దిల్లీ పతనాన్ని శాసించారు.