రూ.15 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడ్డ జింబాంబ్వే యువతి

0
67
advertisment

మనచానల్‌న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
జింబాంబ్వేకు చెందిన ఓ యువతి రూ.15 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల్ని తరలిస్తూ ఢిల్లీ విమానాశ్రయంలోని భద్రతా అధికారులకు దొరికిపోయింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆ యువతి గోవా మీదుగా ఫిలిఫ్పైన్స్‌లోని మనీలాకు అక్రమంగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడిందని అధికారులు తెలిపారు.

ఈమె వద్ద మాదక ద్రవ్యాలున్నాయని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారుల నుండి భద్రతా అధికారులకు సమాచారం రావడంతో ఈ విషయం బయటపడింది. జింబాబ్వేకు చెందిన బెట్టీ రేమ్‌ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో గోవాకు వెళ్లడానికి విమానం ఎక్కేందుకు డిపార్చర్‌ టెర్మినల్‌కు చేరుకోగానే భద్రతా అధికారులు ఆమెను ఆపేశారు.

ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను పరిశీలించగా మెతమ్‌ఫెటమైన్‌ డ్రగ్‌ ఉన్నట్లు బయటపడింది. ఈ డ్రగ్‌ను ఐస్‌ అని కూడా పిలుస్తారని, ఈ డ్రగ్‌కు భారత్‌తో పాటు పలుదేశాల్లో డిమాండ్‌ ఉందని అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఆమెను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులకు విచారణ నిమిత్తం అప్పగించారు. ఈ డ్రగ్స్‌ను ఓ ఆఫ్రికన్‌ నుంచి తీసుకున్నట్లు విచారణలో ఆమె తెలిపింది.