ఏపి టెట్ ఫలితాల్లో 46.87 శాతం అర్హత

0
96
advertisment

మనచానల్‌న్యూస్‌ – అమరావతి
ఏపి టెట్-2018 ఫలితాల్లో 46.87 శాతం అభ్యర్థులు అర్హత సాధించారని విద్యాశాఖ మంత్రి గ౦టా శ్రీనివాసరావు వెల్లడించారు. ఏపి టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఫలితాలను ఆయన సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గ౦టా మాట్లాడుతూ 10వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటాయని,నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించామని, అనుమతి వచ్చిన వెంటనే నియామకాల ప్రక్రియ చేపడతామని వివరించారు. టెట్‌లో మొత్తం 4,14,120 మంది పరీక్ష రాయగా.. ఇందులో 46.87శాతం మంది అర్హత సాధించారని ఆయన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో నిర్వహించిన టెట్‌లో 35శాతం మంది అర్హత సాధించగా ఈసారి 11.87శాతం పెరిగింది. ఓసీలకు 90, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీలకు 60మార్కులు అర్హతగా ఉంది. అన్ని పేపర్లలో కలిపి 25శాతం మందికి 90మార్కుల కంటే ఎక్కువ వచ్చాయి. పరీక్షలు రాసిన 95మంది అభ్యర్థుల ఫలితాలను వెల్లడించలేదు. పేపర్‌-1 పరీక్షకు సంబంధించి ఏడు పరీక్షా కేంద్రాల్లో 84మంది అభ్యర్థులు తమకు 5ప్రశ్నలు ఆన్‌లైన్‌లో కనిపించలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనందున ఈ ఫలితాలు వెల్లడించలేదు. ఇద్దరు అభ్యర్థులు రెండేసి హాల్‌టిక్కెట్లతో రెండు పర్యాయాలు పరీక్షలు రాయగా.. తొమ్మిది మంది అభ్యర్థులు వారు ఇచ్చిన ఐచ్చిక మాధ్యమం కాకుండా ఇతర మాధ్యమంలో పరీక్షలు రాశారు. వీరి ఫలితాలను నిలిపివేశారు. దీనిపై 10రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి గంటా వెల్లడించారు. పేపర్‌-1లో సి.భారతి, యాంద్ర సుబ్రమణ్యంలు అత్యధికంగా 141మార్కులు సాధించగా.. పేపర్‌-2లో మట్టా నాగజ్యోతి, పెసల జ్యోతిలకు 133మార్కులు, పేపర్‌-3లో చల్లా రవికుమార్‌కు అత్యధికంగా 138మార్కులు లభించాయి.