ముక్కోణపు టీ20 టోర్నీలో శ్రీలంక బోణీ

0
65
advertisment

మనచానల్‌, స్పోర్ట్స్‌న్యూస్‌

స్వాతంత్య్రం సాధించి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీలంక నిర్వహిస్తున్న నిదాహాస్‌ ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్‌ను శ్రీలంక ఓడించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. అనంతరం లంక జట్టు 18.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియాలో శిఖర్‌ ధావన్‌ అత్యధికంగా 49 బంతుల్లో 90 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లున్నాయి. అనంతరం శ్రీలంక జట్టు పవర్‌ప్లే 6 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు సాధించి మ్యాచ్‌పై పట్టు బిగించింది. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన మూడో ఓవర్‌లో 4,4,4,6,నోబ్‌4,4,0తో మొత్తం 27 పరుగులు సాధించి మ్యాచ్‌ను ఒక్కసారిగా తమవైపుకు తిప్పుకుంది. శ్రీలంక జట్టులో అత్యధికంగా కుశాల్‌ పెరీరా 66 పరుగులు చేశాడు. చాహల్‌, సుందర్‌లకు రెండేసి వికెట్లు చొప్పున లభించాయి. అంతకుముందు టీమిండియా సారథి రోహిత్‌ శర్మ తొలి ఓవర్‌ నాల్గో బంతికే చమీరా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన టీ20 స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ సురేష్‌ రైనా (1) సైతం నిరాశపరచడంతో టీమిండియా 9 పరుగులకే రెండు ప్రధాన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో వికెట్‌కు మనీష్‌పాండే, ధావన్‌లు 95 పరుగుల భాగసామ్యం నిర్మించి భారతజట్టు గౌరవప్రద స్కోర్‌ సాధించడంలో తోడ్పడ్డారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కుశాల్‌ పెరీరాకు లభించింది.